కొత్త బడ్జెట్ వచ్చేస్తోంది!... మరి నిరుటి బడ్జెట్ నిధులన్నీ ఖర్చయ్యాయా?
మరో నెల గడిస్తే... 2015-16 ఆర్థిక సంవత్సరం ముగిసిపోతోంది. 2016-17 ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ మేరకు కొత్త ఆర్థిక సంవత్సరంలో సర్కారీ ఖర్చులు, రాబడులకు సంబంధించిన సమగ్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. నెలల తరబడి జరిగిన సుదీర్ఘ కసరత్తు ముగిసింది. బడ్జెట్ ప్రతులను బ్రీఫ్ కేస్ లో పెట్టుకుని జైట్లీ మరికాసేపట్లోనే పార్లమెంటుకు రానున్నారు. కొత్త బడ్జెట్ ఓకే... మరి గతంలోకి వెళ్లనున్న 2015-16 బడ్జెట్ కేటాయింపులను ఆయా ప్రభుత్వ శాఖలు ఖర్చు పెట్టేశాయా? అనే విషయాన్ని పరిశీలిస్తే, లేదనే సమాధానమే వస్తోంది. స్వల్ప సంఖ్యలో శాఖలు కేటాయించిన బడ్జెట్ ను పూర్తిగా ఖర్చు పెట్టేయడమే కాకుండా ఓవర్ డ్రాఫ్ట్ కు కూడా వెళ్లాయి. అయితే మెజారిటీ శాఖలు మాత్రం ఆశించిన మేర పనిచేయలేకపోయాయి. గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి ఆయా శాఖలు ఖర్చు పెట్టిన నిధులను ఓ సారి పరిశీలిస్తే... పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లిన శాఖలో పంచాయతీరాజ్ శాఖను చెప్పుకోవచ్చు. ఈ శాఖ తనకు కేటాయించిన నిధులను అప్పటికే ఖర్చు పెట్టేసి మరో 37 శాతం మేర ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లింది. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు నేతృత్వంలోని పౌర విమానయాన శాఖ కూడా తనకు కేటాయించిన నిధుల కంటే 27 శాతం నిధులను అధికంగా ఖర్చు పెట్టేసింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ (111 శాతం), తాగునీరు, పారిశుద్ధ్య శాఖ (110 శాతం) ఆ తర్వాతి స్థానాలను ఆక్రమించాయి.
ఇక ఇచ్చిన నిధులను ఖర్చు పెట్టడంలో సఫలం కాలేకపోయిన శాఖలు చాలానే ఉన్నాయి. వీటిలో ఓవర్సీర్ వ్యవహారాల శాఖ తొలి స్థానంలో ఉంది. తనకు కేటాయించిన నిధుల్లో ఆ శాఖ డిసెంబర్ ఆఖరు నాటికి 6 శాతం నిధులనే ఖర్చు చేయగలిగింది. గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ కూడా నిదానంగానే అడుగులేసింది. ఆ శాఖ కేవలం 18 శాతం నిధులను వినియోగించింది. సమర్థుడిగా పేరున్న మనోహర్ పారికర్ నేతృత్వంలోని రక్షణ శాఖతో పాటు భారీ పరిశ్రమల శాఖ కూడా 24 శాతం నిధులను వెచ్చించేందుకు ఆపసోపాలు పడింది.
ఇక మేకిన్ ఇండియాలో కీలక విభాగంగా పరిగణిస్తున్న స్కిల్ డెవలప్ మెంట్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖ కూడా 33 శాతం నిధులను మాత్రమే ఖర్చు చేయగలిగింది. మొత్తమ్మీద అన్ని ప్రభుత్వ శాఖలు తమకు కేటాయించిన నిధుల్లో డిసెంబర్ ఆఖరు నాటికి 74 శాతం నిధులను ఖర్చు చేసినట్లు లెక్క తేలింది. మరి మిగిలిన 26 శాతం నిధులను ఆయా శాఖలు చివరి త్రైమాసికంలో ఖర్చు చేస్తాయో, లేదో చూడాలి.